Andhra Pradesh : ప్రధాని సభకు వర్షం ముప్పు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రానున్నారు.
By Medi Samrat
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రానున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్న తరుణంలో, వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీంతో ప్రధాని సభ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న వీర పాండ్యన్ ఆధ్వర్యంలో మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. సభా ప్రాంగణంలో వర్షం కురిస్తే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. వర్షం కారణంగా ప్రజలు ఆందోళనకు గురై, ఒక్కసారిగా కదిలే ప్రయత్నం చేస్తే తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.