తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Rain Alert For Telugu States. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉండగా… ఈశాన్య అరేబియా సముద్రంలో
By Medi Samrat Published on 13 July 2021 7:02 AM GMT
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉండగా… ఈశాన్య అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి సమీపంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దేశమంతటా చురుగ్గా రుతుపవనాలు కొనసాగుతూ ఉన్నాయి. కోస్తాంధ్ర తెలంగాణల్లో రానున్న 24 గంటల్లో చెదురుమదురుగా వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ప్రమాదముంది. సముద్రతీరం అల్లకల్లోలంగా ఉన్నందున చేపల వేటపై నిషేధం విధించారు. రేపు తెలంగాణ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలుస్తుంది. ఈనెల 17 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా గుజరాత్‌లోని కచ్ వరకు ఉపరిత ద్రోణి ఆవరించిందని, మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సిరిసిల్ల రాజన్న జిల్లా పెద్దూరులో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.