బుడమేరు కారణంగా విజయవాడలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులో వరద పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి కొసాగుతోంది. బుడమేరు ప్రవాహం తీవ్రమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం నాడు బుడమేరు లోకి ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రానున్న 24 గంట్లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.