మోస్తారు నుంచి భారీ వర్షాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారి ఆదివారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

By Medi Samrat  Published on  2 Dec 2023 3:15 PM GMT
మోస్తారు నుంచి భారీ వర్షాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారి ఆదివారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అధికారులంతా సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్‌. ఈ మేరకు తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదని.. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు సీఎం జగన్. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తుఫాను వల్ల ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం నుండి ఆంధ్రప్రదేశ్‌లోనూ, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడడని ఇప్పటికే సూచించారు. తుఫాన్ ఈనెల 4వ తేదీన, నెల్లూరు మచిలీపట్నం, మధ్య దక్షిణ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాల అన్నింటి పైనా ఉంటుందన్నారు.

Next Story