ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. తెలంగాణలో ఉక్కపోత
Rain Alert For Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు మరో సారి పలకరించనున్నాడు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం,
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు మరో సారి పలకరించనున్నాడు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, అల్పపీడనం కారణంగా గత కొద్ది రోజులుగా ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాబోయే రెండు రోజులు పడే వర్షాలు కొంత ఉపశమనం కలిగించవచ్చు. రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో మంగళవారం ఉత్తరకోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
బుధవారంనాడు ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో కూడా వర్షాలు పడే అవకాశం లేకపోలేదని అధికారులు తెలిపారు. బుధవారం నాడు దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తుయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మరో విధంగా ఉంది. రుతుపవనాలు వచ్చిన తొలి వారంలో తెలంగాణలో విస్తారంగా కురిసిన వర్షాలు ఆ తర్వాత కనుమరుగయ్యాయి. రాష్ట్రంపై పొడి మేఘాలు కమ్ముకోవడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలిలో తేమ 15 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఉక్కపోతలు మొదలయ్యాయి. నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమే లేదని వాతావరణ శాఖ అంటోంది. దక్షిణ భారతదేశంలో మొదలైన రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు వెళ్లిపోవడంతో అక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని.. అక్కడ తగ్గితే ఇక్కడ వర్షాలు పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.