వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని అన్నారు. టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్యపైనా రఘురామ స్పందించారు. చంద్రయ్యను ఎంతో దారుణంగా హత్య చేశారని.. వ్యవస్థ నచ్చకపోయినా, వ్యక్తి నచ్చకపోయినా సీఎం జగన్ తీసేస్తుంటారని విమర్శించారు. ఇక తమ ప్రభుత్వానికి, ఓ ఆంగ్ల పత్రికకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ఆ పత్రికలో చిరంజీవిని రాజ్యసభకు పంపుతున్నారంటూ కథనం వచ్చిందని వివరించారు. అయితే, రాజ్యసభ పదవి కోసం చిరంజీవి వైసీపీలో చేరతారని భావించడంలేదని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగే పని చిరంజీవి చేయడని అన్నారు.
జగనన్న గోరుముద్ద పథకం ఏపీలో కొనసాగబోదని అన్నారు. ఈ అంశంలో తన లేఖకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారని తెలిపారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో జగనన్న పథకాలు కొనసాగించలేరని రఘురామ అన్నారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ గురించి తాను ఎలాంటి ప్రకటనలు చేయలేదని తెలిపారు. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకు పోలీసులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. సంక్రాంతి సందర్భంగా సొంత నియోజకవర్గం నరసాపురం రావాలని అనుకున్న రఘురామ.. కొన్ని కారణాల వలన రావట్లేదని తెలిపారు.