ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! రఘురామకృష్ణరాజు తనను కొట్టారు అంటూ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలాన్ని రేపాయి. కాళ్లకు గాయాలు ఎలా తగలాయన్న దానిపై గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు నివేదించగా, జిల్లా కోర్టు ఆ నివేదికను పరిశీలించి హైకోర్టుకు అందజేసింది. రఘురామ వైద్య పరీక్షల నివేదికను ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి పంపింది. జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తికావడంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజుకు ఖైదీ నంబర్‌ 3468 కేటాయించారు. గుంటూరు జైల్లోని పాత బ్యారక్‌లో ఒక సెల్‌ను ఆయనకు కేటాయించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని.. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులను జైలుకు పక్కా ప్రణాళికతో ముందుగానే తరలించారని అన్నారు. తన భర్తను మొన్న సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అర్ధరాత్రి వేళ ఆయనను తీవ్రంగా కొట్టారని.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రఘురామను బెదిరించారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకు తన భర్త ఒప్పుకోకపోవడంతో బాగా కొట్టారని చెప్పారు. అరెస్టయిన సమయంలో బాగా నడుచుకుంటూ వెళ్లారని, ఒక్కరోజులో పరిస్థితి మారిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట భద్రతా సిబ్బంది లేరని, కుటుంబసభ్యులం తాము కూడా లేమని, ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నప్పటికీ జైలుకు తరలించడం వెనుక కుట్ర ఉందని భావిస్తున్నామని అన్నారు.


సామ్రాట్

Next Story