2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లపై ఆ పార్టీ రెబల్ ఎంపీ కామెంట్స్..!
Raghurama Krishna Raju Comments On 2024 Elections. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు 2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లపై శుక్రవారం
By Medi Samrat
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు 2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లపై శుక్రవారం కామెంట్ చేశారు. తమ పార్టీ వైసీపీ చేయించిన సర్వేలో టీడీపీకి 115 సీట్లు వస్తాయని, వైసీపీకి కేవలం 60 సీట్లు మాత్రమే వస్తాయని తేలిందని ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా జగన్ అంత ధైర్యంగా 175 స్థానాల్లో విజయం సాధిస్తామని ఎలా చెబుతున్నారోనని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పనిచేయని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని జగన్ చెప్పిన విషయంపైనా ఆయన స్పందించారు. సామర్థ్యం మేరకు పనిచేయని దాదాపు 100 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోనని జగన్ చెప్పారని, అయితే వచ్చే ఎన్నికల్లో ఏకంగా 120 మంది అసలు పార్టీ టికెట్లే అడగరంటూ రఘురామరాజు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి భయం భయంగానే వైసీపీ ఎమ్మెల్యేలు వెళుతున్నారని విమర్శించారు.
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలకు ఎదురైన అనుభవాలు, ప్రజలు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం ఎలా అన్న అంశాలపై చర్చించేందుకు జగన్ ఈ సమీక్షను నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు. గడపగడపకు కార్యక్రమంలో పార్టీ నేతల పనితీరుపై జగన్ ఓ నివేదిక తెప్పించుకున్నారు. ఓ ఏడుగురు ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ జీరోగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఏడుగురు ఇళ్లు కదలకుండానే... తమ అనుచరులను పంపుతూ కార్యక్రమాన్ని నెట్టుకొస్తున్నారనే విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం.