వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయనను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ గుంటూరుకు చేరుకున్నారు. రఘురామ కృష్ణరాజును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఆయనపై ఐపీసీ 124 (A), 153(A), 505, 124A, 120 (b) of IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతూ ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఉన్న వివరాల ప్రకారం ఒక పథకం ప్రకారం కొన్ని మీడియా చానళ్లతో కలిసి రఘురాజు కుట్ర పన్నారని అన్నారు. కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొట్టేలా కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా రెడ్డి, క్రిస్టియన్ వర్గాలను రఘురాజు టార్గెట్ చేశారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించేందుకు కొన్ని టీవీ చానళ్లతో కలిసి కుట్రపన్నారని ఆరోపించారు. కొన్ని టీవీ చానళ్లు రఘురాజుకు స్లాట్స్ కేటాయించాయని.. వీరందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని తెలిపారు.