రఘురామ ఇక హ్యాపీయేనా.. మొదటి లక్ష్యం నెరవేరిందా.?
ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన నేతల్లో రఘురామ కృష్ణరాజు ఒకరు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు
By Medi Samrat Published on 21 April 2024 1:09 PM GMTఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన నేతల్లో రఘురామ కృష్ణరాజు ఒకరు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే వచ్చారు. అలాంటి రఘురామ ఎన్నికల ముందు వైసీపీని వీడారు. తాను మరోసారి నరసాపురం ఎంపీగా గెలుస్తానని ధీమాగా చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ-బీజేపీ ఆయనకు ఎంపీ టికెట్ విషయంలో ఊహించని షాక్ ఇచ్చాయి. ఆయనకు సభ్యత్వమే లేదని రెండు పార్టీలు చెప్పడంతో రఘురామ అవాక్కయ్యారు. చివరికి టీడీపీ సభ్యత్వం తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆయన నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో బాగానే పోరాడారు కానీ.. అప్పటికే ఆలస్యమైంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆయన చేతుల్లో పెట్టారు.
ఉండి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న రఘురామకృష్ణ రాజు.. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుండి బీ ఫారం అందుకున్నారు. "ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల మీదుగా ఉండి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీ ఫారం అందుకున్నాను. నన్ను ఎల్లప్పుడూ ఆదరించి, ఆశీర్వదిస్తున్న ఉండి ప్రజల వెన్నంటి నిలిచి, ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని ఈ సందర్భంగా ఉండి ప్రజానీకానికి మాటిస్తున్నాను" అంటూ రఘురామ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 22న సోమవారం ఉదయం 10 గంటలకు పెద అమిరంలోని తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేస్తానని రఘురామ తెలిపారు. టికెట్ దక్కించుకుని మొదటి లక్ష్యం నెరవేర్చుకున్న రఘురామ.. అసెంబ్లీ లోకి అడుగుపెడతారో లేదో చూడాలి.