సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు
PV Sindhu Meet With CM Jagan. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా
By Medi Samrat Published on 6 Aug 2021 12:30 PM ISTటోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే.. శుక్రవారం ఉదయం సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో సీఎం జగన్‌ను కలిసింది పీవీ సింధు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ లో గెలిచిన కాంస్య పతకాన్ని జగన్‌కు చూపించింది సింధు. ఈ సందర్భంగా సీఎం జగన్ సింధును సత్కరించారు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మీ ఆశీర్వాదంతో పతకాన్ని నెగ్గానని సీఎంతో సింధు అనగా.. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం జగన్ అన్నారు. విశాఖపట్నంలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సింధును సీఎం కోరారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారుకావాలని జగన్ సింధుతో చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అందించారు.
ఇదిలావుంటే.. పీవీ సిందు ఈ ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సింధుకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో సింధు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని.. పతకం సాధించిన అనంతరం అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉందని.. 2024 ఒలింపిక్స్‌లో కూడా ఆడాలని.. ఈ సారి స్వర్ణం సాధించాలని సింధు అన్నారు.