మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
Protesters Set Fire Minister Vishwaroops House. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ గడియారం స్తంభం సెంటర్ వద్
By Medi Samrat Published on 24 May 2022 1:01 PM GMT
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ గడియారం స్తంభం సెంటర్ వద్ద కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ ఇంటిపై ఆందోళనకారులు దాడికి దిగారు. అనంతరం ఇంటికి నిప్పంటించారు. దాడికి ముందే మంత్రి కుటుంబసభ్యులను పోలీసులు కారులో తరలించారు. తృటిలో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంతకుముందు ఆందోళనకారులు అన్నివైపుల నుంచి అమలాపురంలోకి వచ్చారు. బస్టాండ్, ముమ్మిడివరం వైపు నుంచి.. ప్రదర్శనగా గడియారం స్తంభం వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని అక్కడ నియంత్రించేందుకు యత్నించారు.
ఓ దశలో లాఠీలతో చెదరగొట్టారు. ఆందోళనకారులను పోలీసులు వెంబడించారు. కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని యువకులు.. కలెక్టరేట్ వైపు పరుగులు తీశారు. దీంతో అమలాపురం రణరంగంగా మారింది. కలెక్టరేట్ వద్ద ఆందోళనకారులు బస్సును దగ్ధం చేయడంతో పాటు.. కలెక్టరేట్ వద్ద మరో బస్సును ధ్వంసం చేశారు. అమలాపురం ఆస్పత్రి వద్ద పోలీసు జీపుపై, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడి నుంచి ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. నల్ల వంతెన వద్ద ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్తున్న నిరసనకారులను పోలీసులు నిలువరిస్తున్నారు.