నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలు
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
By Medi Samrat
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాల్టీ సంస్థ అయిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నారెడ్కొ) ప్రతినిధులు గురువారం అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. నాలా చట్టం రద్దు వెనుక మంత్రి అనగాని సత్యప్రసాద్ కృషి ఎంతో ఉందని వారు చెప్పారు. మంత్రి సత్యప్రసాద్ కు శాలువా కప్పి పుష్ఫగుచ్చం అందించారు.
ఈ సందర్భంగా వారితో మంత్రి అనగాని మాట్లాడుతూ.. రాష్ర్టాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటారని, నాలా చట్టం రద్దు నిర్ణయం కూడా అందులో భాగమేనని చెప్పారు. స్పీడ్ ఆప్ డూయింగ్ లో భాగంగా ఈ సమస్య తన ద్రుష్టికి వచ్చిన వెంటనే సీఎం వద్దకు తీసుకెళ్లి త్వరగా నిర్ణయం తీసుకోగలిగామని చెప్పారు. నాలా చట్టం రద్దుపై విధివిధానాలు కూడా అతి త్వరలోనే వస్తాయని చెప్పారు. నాలా చట్టం రద్దు రాష్ర్టంలో రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల ప్రగతికి ఎంతో దోహదపడుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నాలా రద్దు చేయాలన్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందని నారెడ్కొ ప్రతినిధులు తెలిపారు. నాలా అనుమతులు తెచ్చుకునేందుకు ఏడాది పాటు సమయం పట్టడంతోపాటు ఫీజులు కూడా అధికంగా ఉంటున్నాయని చెప్పారు. నాలా రద్దుకు ప్రత్యేక కృషి చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.