16న లేపాక్షికి ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 14 Jan 2024 8:15 PM ISTఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించనున్నారు. పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సందర్శించనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ జవహర్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
జనవరి 16వ తేదీన ప్రధాని మోదీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి చేరుకుంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సెంటర్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్– రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు. వారితో గ్రూప్ ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి పబ్లిక్ ఫంక్షన్‌లో ‘ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. అనంతరం ఢిల్లీకి ప్రయాణమవుతారు.