ఏపీకి ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025 జనవరి 8న విశాఖపట్నం, అనకాపల్లిలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 25 Dec 2024 4:30 PM IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025 జనవరి 8న విశాఖపట్నం, అనకాపల్లిలో పర్యటించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ వేడుక నవంబర్ 29న జరగాల్సి ఉండగా.. భారీ వర్షం హెచ్చరికల కారణంగా వాయిదా పడింది.ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని ధృవీకరిస్తూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ షెడ్యూల్ ను విడుదల చేశారు. మోదీ తన పర్యటన సందర్భంగా బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే తొలిసారి. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ హాజరయ్యారు. ఇప్పుడు తొలిసారిగా అధికారికంగా ఏపీలో పర్యటించనున్నారు.
ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన విధంగా భారీగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి లోకేష్ తో పాటు అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ పర్యవేక్షిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టిపిసి, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.