అమరావతి: విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రధాని మోదీ చేతలు మీదుగా విశాఖలో దీనికి శంకుస్థాపన జరగనుంది. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం నాడు సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. అక్కడ ప్రధాని మోదీని కలిశారు.
గంట 15 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, వరదల కారణంగా వచ్చిన నష్టాన్ని సరిదిద్దడానికి సాయంపై చర్చించారు. అలాగే ఆంధ్రా - 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానితో సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.