పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ వదిలేలా లేడుగా..
జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.
By Medi Samrat
జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "గెలవక ముందు 'జనసేనాని', గెలిచిన తరువాత 'భజన సేనాని'... అంతేనా? అని ప్రశ్నించారు. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టుల్ని ప్రకాష్ రాజ్ ట్వీట్‌కి జత చేశారు.
బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. ''మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్...'' అంటూ కౌంటర్ ఇచ్చారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమిళనాడులో జరుగుతున్న భాష వివాదంపై పరోక్షంగా స్పందించారు. కొందరు భాష, సంస్కృతినీ తిడుతున్నారని.. హిందీని రుద్దుతున్నారంటా హడావుడి చేస్తున్నారని అన్నారు. 'అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు. అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా?, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది' అని పవన్ అన్నారు.