ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీపై మళ్లీ ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు వల్ల ఏపీలో కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి పోతున్నాయని.. నిరుద్యోగుల సంఖ్య కోటికి చేరుకుందన్నారు. ఏపీలో అనేక జిల్లాల వారు నన్ను కలిశారని, జీతాలు రావటం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారని పాల్ అన్నారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని.. మోదీకి నాకు మధ్య గొడవ జరిగిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏం చేసినా కొడుకు కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదని ఆరోపించారు.
లక్షల కోట్లు అప్పు చేసిన జగన్‌కి మళ్లీ పాలన ఇస్తే ఇబ్బంది పడాల్సివస్తుందన్నారు. ఏపీలో 100కి 60 శాతం ప్రజలు నన్నే కోరుకుంటున్నారని పాల్ అన్నారు. చంద్రబాబు, జగన్‌ని గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టేనని అన్నారు. చంద్రబాబు ఇక సీఎం కాలేరని జోస్యం చెప్పారు. సీఎం జగన్ 30 నిమిషాల సమయం ఇస్తే..రాష్ట్రం అప్పు తీర్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. నన్ను గెలిపిస్తే ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. కుల కుటుంబ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్ప లాభం లేదని రాష్ట్ర ప్రజలకు అర్దం అవుతోందని అన్నారు పాల్.