చిన్న పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్స్.. ఏమి చేస్తున్నారు, ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో 3వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై జరిపిన విచారణలో నిందితులు ముగ్గురు మైనర్లు మొబైల్ ఫోన్‌లలో పోర్న్ వీడియోలు చూసేవారని తేలింది.
By Medi Samrat Published on 3 Aug 2024 3:56 PM ISTఆంధ్రప్రదేశ్‌లో 3వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై జరిపిన విచారణలో నిందితులు ముగ్గురు మైనర్లు మొబైల్ ఫోన్‌లలో పోర్న్ వీడియోలు చూసేవారని తేలింది. నంద్యాలకు చెందిన 3వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేయగా, మైనర్లలో ఒకరి బంధువులు ఆమె మృతదేహాన్ని నీళ్లలో పడేయడానికి సహకరించారు. బాలిక మృతదేహం జాడ ఇంకా తెలియలేదు.
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగిన మరో ఘటనలో, మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియో చూసి 9 ఏళ్ల బాలికపై ఆమె 13 ఏళ్ల సోదరుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. తల్లి, ఇద్దరు అక్కలు హత్యను కప్పిపుచ్చడానికి సహాయం చేశారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఇచ్చారు. ఆన్‌లైన్ తరగతులు ప్రవేశపెట్టినప్పుడు పిల్లల చేతుల్లోకి మొబైల్ ఫోన్స్ రావడంతో అప్పటి నుండి దానికి బానిసలయ్యారు. సైడ్ ఎఫెక్ట్‌గా కొంతమంది పిల్లలు మొబైల్ ఫోన్‌లలో పోర్న్ చూస్తూ డేటాను దుర్వినియోగం చేయడం కూడా ప్రారంభించారు.
పిల్లలు మొబైల్ ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
1. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్ యాప్‌లను సైబర్ బెదిరింపులు, వేధింపులు, హానికరమైన కంటెంట్‌ని వ్యాప్తి చేయడం కోసం సాధనాలుగా ఉపయోగించవచ్చు. ఇవి బాధితులపై తీవ్రమైన మానసిక ప్రభావాలను కలిగిస్తుంది.
2. మొబైల్ ఫోన్‌లు పిల్లల మధ్య అనుచితమైన చిత్రాలను లేదా సందేశాలను సులభంగా పంచుకోవడానికి వీలు కల్పిస్తాయి, కొన్నిసార్లు తెలియకుండానే, ఇది దోపిడీకి, బ్లాక్‌మెయిల్‌కు, చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు.
3. సోషల్ మీడియా ద్వారా ఇతర వ్యక్తులు పిల్లలను సులువుగా సంప్రదించవచ్చు. అవతలి వ్యక్తులు ఎలాంటి వారో.. ఎక్కడి వారో.. ఏ ఉద్దేశ్యంతో మీ పిల్లలను కాంటాక్ట్ చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం. చివరికి ఆఫ్‌లైన్ లో కూడా పిల్లలను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది.
4. పిల్లలు అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా పైరేటెడ్ సినిమాలు, కాపీరైట్ చేయబడిన మెటీరియల్ లేదా తీవ్రవాద ప్రచారం వంటి చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇది చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు.
5. సోషల్ మీడియాలో లేదా మొబైల్ యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల పిల్లల సమాచారం బయటకు వెళుతుంది. స్కామర్‌లు సున్నితమైన సమాచారాన్ని పంచుకునేలా చేస్తారు.
6. సోషల్ మీడియా మాదకద్రవ్యాల వాడకం, మాదకద్రవ్యాల దుర్వినియోగంలో ఉన్న సహచరులతో సంబంధాలను సులభతరం చేస్తుంది, ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వినియోగించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారి తీసే ప్రమాదం ఉంది.
7. పిల్లలను రిక్రూట్ చేయడానికి, నేర కార్యకలాపాలలో నిమగ్నమయ్యే ముఠాకు సంబంధించిన కంటెంట్‌ను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా కారణమవుతుంది. పిల్లల చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్‌ల కారణంగా చట్టవిరుద్ధమైన పనుల్లో వారి ప్రమేయానికి దారి తీస్తుంది.
8. మొబైల్ ఫోన్‌లు, సోషల్ మీడియా యాప్‌లలోని జియోలొకేషన్ ఫీచర్‌లు పిల్లల లొకేషన్‌ను బహిర్గతం చేయగలవు. ఆ సమాచారం ఉండడం వల్ల వారిని వెంబడించడం లేదా కిడ్నాప్ చేయడం వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి.
9. సోషల్ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ ను ఉపయోగించి పిల్లలను బెదిరింపులకు గురి చేయడమే కాకుండా.. పిల్లలతో విధ్వంసానికి కూడా ప్లాన్ చేసే ప్రమాదం పొంచి ఉంది.
10. పిల్లల చేతుల్లోని మొబైల్ ఫోన్‌లను హ్యాక్ చేయడం చాలా సులువు.. మాల్వేర్ వ్యాప్తి చేయడానికి లేదా ఆన్‌లైన్‌లో చూసే లేదా నేర్చుకునే వాటి ప్రభావంతో ఇతర రకాల సైబర్ క్రైమ్‌లలో పాల్గొనడానికి దుర్వినియోగం చేయవచ్చు.
వైద్యులు ఏమి చెబుతున్నారు?
న్యూస్‌మీటర్‌తో హైదరాబాద్‌లోని ఆశా హాస్పిటల్‌లోని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా రష్మి మాట్లాడుతూ, "చాలా మంది తల్లిదండ్రులు ఫోన్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. కోవిడ్ మహమ్మారి రాకతో ప్రతిదీ మారిపోయింది. కానీ తల్లిదండ్రులు.. పిల్లలు ప్రభావితమైనా అందులో నుండి బయటకు రావాల్సి ఉంటుంది. ప్రతి బిడ్డను పర్యవేక్షించాల్సిన సమయం ఆసన్నమైంది." అని తెలిపారు.
డాక్టర్ ప్రగ్యా వివరిస్తూ.. ఇది కేవలం పిల్లల గురించి మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా పిల్లలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. తమ పిల్లలు సినిమాలు చూస్తున్నారా, చదువుతున్నారా లేదా అడల్ట్ కంటెంట్ చూస్తున్నారా అనేది కొందరు తల్లిదండ్రులకు కూడా తెలియదు. పిల్లలకు ఇప్పుడు అన్నీ తెలుసు.. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు YouTubeలో వీడియోలను అప్‌లోడ్ చేయగలరు.. ఇది చూసి వారి తల్లిదండ్రులు గర్వపడతారు. నోటిఫికేషన్‌లు, మొబైల్ ఫోన్‌లలో వినోదాన్ని నిరంతరం యాక్సెస్ చేయడం వలన పిల్లల చదువుల నుండి దృష్టి మరల్చవచ్చు, వారి విద్య, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొబైల్ వాడకంపై అవగాహన పాఠశాల నుండే ప్రారంభం కావాలని అన్నారు.
రీల్స్ చూడటం - ప్రమాదకరమైన వ్యసనం
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్‌లను బ్రౌజ్ చేసే ప్రతి వ్యక్తికి రీల్స్ చూసే అలవాటు ఉంటుంది. అయితే రీల్స్ చూడటం ప్రమాదకరమైన వ్యసనం అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. "సోషల్ మీడియా, మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు ఇప్పుడు పెద్ద టాపిక్. రీల్స్ చూడటం ఒక సమస్య. పిల్లలు రీల్‌లను అమితంగా చూస్తారు. ముఖ్యంగా US, కొరియన్ పిల్లల కంటెంట్ చూస్తూ ఉంటారు. పిల్లలు వాస్తవికత మధ్య తేడాను గుర్తించలేరు. ఇతర దేశాల పిల్లలు చేసిన విధంగా చేయాలని కోరుకుంటారు. ఈ రీల్‌లు పిల్లలను ప్రమాదంలోకి నెట్టుతాయి," అని డాక్టర్ ప్రగ్యా చెప్పారు.
పిల్లల ద్వారా కంటెంట్
ఉదాహరణకు- ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్, "పరేషన్ బాయ్స్" పిల్లలపై వేధింపులతో కూడిన 'డేర్' కంటెంట్‌తో ఈ ఛానల్ లో వీడియోలు వస్తుంటాయి. పిల్లలు రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాల వీడియోలను కూడా అప్‌లోడ్ చేస్తారు. పిల్లలు రూపొందించిన ఇటువంటి అనుచితమైన కంటెంట్ లేదా వీడియోలకు యాక్సెస్ అవ్వడం ద్వారా పిల్లలు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, లైంగిక కార్యకలాపాలు, ప్రమాదకరమైన సవాళ్ల వంటి ప్రమాదకర ప్రవర్తనలలో పాల్గొనేలా ప్రభావితం చేయవచ్చు.
YouTube తన తాజా నివేదికలో, YouTube ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్‌ల ద్వారా ప్రాథమికంగా ఫ్లాగ్ చేసిన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశం నుండి 2,618,760 వీడియోలు తొలగించారు. జనవరి నుండి మార్చి 2024 వరకు 8,295,304 వీడియోలను YouTube తొలగించారు. పిల్లల భద్రతా కారణాల దృష్ట్యా ఈ మొత్తం వీడియోల్లో 43% తీసివేయబడ్డాయి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌లో వివరించిన విధంగా కంటెంట్‌ను ఖచ్చితంగా నిషేధించడంలో YouTube విఫలమవడం వల్ల యుక్తవయస్కులు ప్రమాదంలో పడుతున్నారు. ఎందుకంటే అలాంటి కంటెంట్ ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌లో సులభంగా యాక్సెస్ చేయగలుగుతూ ఉన్నారు.
అపెక్స్ చైల్డ్ రైట్స్ బాడీ NCPCR నెట్ ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో మైనర్‌లకు యాక్సెస్ చేయగల "లైంగిక అసభ్యకరమైన కంటెంట్"ని చూపుతున్నారనే ఆరోపణలపై వచ్చే నెట్‌ఫ్లిక్స్ అధికారులను పిలిచింది. జూలై 23న Netflix అధికారులకు రాసిన లేఖలో, నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) నెట్‌ఫ్లిక్స్‌లో మైనర్‌లకు "ప్రత్యేకమైన కంటెంట్ అనియంత్రిత ప్రాప్యత" అనేది లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం-2012ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇదే విషయంపై గతంలో జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని NCPCR తెలిపింది. ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ నుండి తక్షణ స్పందన అందుబాటులో లేదు
పరిష్కార మార్గాలు ఏమిటి?
ఈ సమస్యలను పరిష్కరించడానికి.. తల్లిదండ్రులు, అధ్యాపకులు తప్పనిసరిగా ముందుకు రావాలి. ఆన్‌లైన్ భద్రత, వారు చేసే పనులకు సంబంధించిన పర్యవసానాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. సాంకేతికతను వినియోగించడానికి సంబంధించి స్పష్టమైన నియమాలను అమలు చేయాలి. ఏవైనా ఆందోళనలు, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఓపెన్ కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించాలి. పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని పర్యవేక్షించడం, చర్చించడం, పరిమితులను నిర్ణయించడం లాంటివి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు తమ ఆన్‌లైన్ అనుభవాలు, ఆందోళనలు, సమస్యలను తల్లిదండ్రులతో పంచుకునే వాతావరణాన్ని సృష్టించాలి.