ఆత్మీయున్ని కోల్పోయాం.. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి ప‌ట్ల ప్రముఖుల సంతాపం

Politicians Expresses Grief over death Minister Gowtahm Reddy. ఆంధ్రప్రదేశ్ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ‌ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం ప‌లువురిని క‌లిచివేసింది.

By Medi Samrat  Published on  21 Feb 2022 10:30 AM IST
ఆత్మీయున్ని కోల్పోయాం.. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి ప‌ట్ల ప్రముఖుల  సంతాపం

ఆంధ్రప్రదేశ్ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ‌ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం ప‌లువురిని క‌లిచివేసింది. ఆయ‌న మృతిప‌ట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

సీఎం జగన్‌

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌రెడ్డి అని సీఎం జ‌గ‌న్ అన్నారు. మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనని సీఎం జగన్ విచార్ వ్య‌క్తం చేశారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాన‌ని సీఎం జ‌గ‌న్ త‌న సందేశాన్ని తెలియ‌జేశారు.

చంద్రబాబు

రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరం అన్నారు. మంత్రివర్గం లో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.

కేటీఆర్

గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తనను షాక్ గురిచేసిందని చెప్పారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'ప్రియమైన మిత్రుడి ఆకస్మిక మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. నమ్మలేని విధంగా షాక్ అయ్యాను.. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా త్వరగా వెళ్లిపోయారు అన్న.. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు.

రేవంత్ రెడ్డి

ఆంద్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియ‌జేశారు. ఆంద్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి అకాల మరణం నన్ను కలచివేసింది. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత చిన్న వయసులోనే కన్నుమూశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాన‌న్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

బొత్స సత్యనారాయణ..

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాస్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడిన సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. ఆయన కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేశారు. గౌత‌మ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

కింజరాపు అచ్చెన్నాయుడు

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసింది. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్వువు కబళించింది. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబందం లేకుండా అందిరితోనూ ఆప్యాయంగా కలిసిపోయేవారు.. హుందాగా ప్రవర్తించేవారు. ‎ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియ‌జేశారు.

ధర్మాన కృష్ణదాస్

ఆత్మీయుడు, మంచి సహచరుడు, సమర్ధుడైన నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిదని, గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తమ సహచరుల్లో ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక, నైపుణ్యభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకు రావడం వెనక ఆయన విశేషమైన కృషి దాగి ఉందని గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని కృష్ణదాస్ వ్యక్తం చేశారు.


Next Story