పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత: సీఎం చంద్రబాబు
డ్యూటీలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల మనసుల్లో నిలిచారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 21 Oct 2024 10:08 AM ISTపోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత: సీఎం చంద్రబాబు
అమరావతి: డ్యూటీలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల మనసుల్లో నిలిచారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలీసుల శాఖ అత్యంత కీలకమైనదని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకమని, ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు పగలు, రాత్రులు కష్టపడుతున్నారని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని, ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారని అన్నారు. పోలీసుల సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దీటైన పోలీసు వ్యవస్థకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో గ్రేహౌండ్స్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
2014 - 19లో రూ.600 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. కొత్తగా వాహనాల కోసం రూ.150 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. పోలీసు కార్యాలయాలు మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.60 కోట్లు ఖర్చుపెట్టామని, రూ.27 కోట్లు ఖర్చు పెట్టి ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేశామన్నారు. పోలీసు సంక్షేమానికి ఐదేళ్లలో రూ.55 కోట్లు ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.