ఆంధ్రప్రదేశ్ ర‌వాణా, స‌మాచార మంత్రిత్వ శాఖ మంత్రి పేర్ని నానిపై ఇటీవ‌ల ఓ వ్య‌క్తి దాడికి య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. నాని ఇంటి వద్ద ఆయనపై నిందితుడు తాపీతో దాడికి యత్నించాడు. అతడిని పట్టుకున్న పేర్ని నాని అనుచరులు పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు టీడీపీ నాయ‌కుల‌ను పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసు స్టేషన్‌కు తరలించి, ప్రశ్నించేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఈ దాడికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని.. అలాగే కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించి చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా ఆధారాలు ఇవ్వాలని ఆయనకు ఇప్ప టికే నోటీసులు జారీ చేశారు. లిఖిత పూర్వకంగా వివరణ నమోదు చేసుకున్నాక పోలీసు స్టేషన్‌కు ఎందుకు రావాలని కొల్లు రవీంద్ర పోలీసులను ప్ర‌శ్నించారు. ఈ కేసుతో సంబంధం లేని తనను విచారించేందుకు స్టేషన్‌కు రమ్మనడం ఏంట‌ని అడిగారు. పోలీసులు ర‌వీంద్ర ఇంటికి వ‌చ్చార‌ని తెలుసుకున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.


సామ్రాట్

Next Story