కాకినాడ రైల్వేస్టేషన్‌లో చీకట్లో ఒంటరిగా కూర్చున్న మహిళను టూటౌన్ పోలీసులు రక్షించారు. ఇటీవల భర్త మందలించాడని మనస్తాపం చెందిన రాజమండ్రికి చెందిన గొల్లపల్లి రంగలక్ష్మి అనే మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి రాజమండ్రి నుంచి కాకినాడకు చేరుకుంది. అర్ధరాత్రి ఒంటిగంటకు ఎక్కడికి వెళ్లాలో తెలియక రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్ చివర చీకట్లో టేబుల్‌పై ఒంటరిగా కూర్చుంది.
అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆమె కనపడింది. మహిళకు ఆహారం, నీళ్లు ఇచ్చి ఆమె పూర్తి వివరాలు తెలుసుకుని పిఠాపురంలోని తండ్రికి సమాచారం అందించారు. మహిళకు మహిళా కానిస్టేబుల్ ద్వారా కౌన్సెలింగ్ చేసి తండ్రికి అప్పగించారు.
మహిళల భద్రత దృష్ట్యా రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద రాత్రిపూట గస్తీ పెంచాలని జిల్లా పోలీసులను ఎస్పీ ఇటీవల ఆదేశించారు. ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ సేవలను పొందేందుకు ఎవరైనా 94949 33233, 94907 63498 నంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.