టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించడంతో పాటు, దూషించారంటూ డీఎస్పీ భక్తవత్సలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఫిర్యాదు నేపథ్యంలో చంద్రబాబు, మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 353, 149, 188 మోపినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు రోడ్ షోకి అనుమతి లేదంటూ పోలీసులు బలభద్రపురం వద్ద అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీసులు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు వాహనం దిగి కాలినడకన 7 కిలోమీటర్లు ప్రయాణించి అనపర్తి చేరుకున్నారు. ఈ ఘటనలు జరుగుతున్న తరుణంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
అనపపర్తిలోని దేవీచౌక్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నో అవమానాలు భరించా. ఇంకా మీకోసం భరిస్తా. అనపర్తికి వస్తానంటే ముందుగా అనుమతి ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా నాచేతిలోనే ఉంది. జగ్గంపేట, పెద్దాపురం వెళ్తే పోలీసులు సహకరించారు. కానీ అనపర్తిలో ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.