ఏపీలోని పలు జిల్లాలో ఈ ఏడాది పట్టుబడ్డ గంజాయిని పోలీసులు దహనం చేశారు. గుంటూరు, విశాఖ రేంజ్ పరిధిలో 25 టన్నుల గంజాయిని వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నారు. వీటి విలువ సుమారు మూడు వందల కోట్లకు పైగా ఉంటుంది. గుంటూరు జిల్లా పేరేచర్ల పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో ఐదు జిల్లాల్లో పట్టుబడిన గంజాయిని పోలీసులు దహనం చేశారు. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ... రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాలు 52 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ యేడాది 146 కేసుల్లో 10.42 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐదు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన వాటిలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. 929 కేసుల్లో పట్టుకున్న 1.93 లక్షల కేజీల గంజాయి, 133 లీటర్ల ఆశిష్ ఆయిల్‌కు నిప్పు అంటించారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.240 కోట్లు ఉంటుందని అంచనా. అనకాపల్లి జిల్లా శివారు ప్రాంతాలలో కోడూరు వద్ద రెండవ దఫా గంజాయి ధ్వంసం చేశారు.