ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర టీడీపీ నేతలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానితుల చిత్రాలను ఫిర్యాదుతో పాటు అందజేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. వాహనంపై రాళ్ల దాడి జరిగిన ఘటనలో చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. అయితే చంద్రాబు ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకు రాయి తగలడంతో గాయమైంది. దీంతో వెంటనే మధుబాబుకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటన తర్వాత ఎస్పీజీ భద్రతా సిబ్బంది చంద్రబాబు నాయుడుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులు రోప్ పార్టీ భద్రతను ఏర్పాటు చేశారు.
అంతకు ముందు విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా స్పందించారు. నందిగామ పర్యటనలో రాళ్ల దాడిలో సీఎస్ఓ మధుకు గాయం కాగా.. ప్రధమ చికిత్స తరువాత యధావిధిగా విధులకు హాజరయ్యారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని సీపీ తెలిపారు. అయినప్పటికీ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 15 కెమెరాల ఫుటేజ్, మా వీడియో గ్రాఫర్ల ఫుటేజ్, మీడియా ఫుటేజ్‌ల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరీటీ ఉండటంతో మొత్తం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దాడి వెనుక ఉన్నది వైసీపీ నాయకులేనని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఆరోపించారు.