ఏపీ విద్యార్ధులపై లాఠీఛార్జ్.. విద్యార్థినికి తీవ్ర గాయాలు..!
Police baton charge on students in AP. ఏపీ విద్యార్ధులపై లాఠీఛార్జ్.. విద్యార్థినికి తీవ్ర గాయాలు..!
By అంజి Published on 8 Nov 2021 12:07 PM ISTఅనంతపురంలో ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ల విలీనాని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీ దగ్గర విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎప్ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీ, స్కూల్ విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే కాలేజీ యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరించింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని సైతం విద్యాశాఖ పంపించింది. ఈ వ్యవహారంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. విలీనాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు.
కాలేజీ, స్కూల్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఫీజులను కట్టలేమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు వచ్చారు. అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొంతమంది నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థిని తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. లాఠీఛార్జ్ అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తమపై పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించి లాఠీఛార్జ్‌కి దిగారని విద్యార్థులు ఆరోపించారు.