ఏపీలో అమృత్ భారత్ కింద రూ.453.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 18 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 6న వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు, తుని, తెనాలి, అనకాపల్లి, విజయనగరం, తాడేపల్లిగూడెం, సింగరాయకొండ, నిడదవోలు, దొనకొండ, దువ్వాడ, నరసాపురం, రేపల్లె, పిడుగురాళ్ల, పలాస, ఏలూరు, కాకినాడ టౌన్, భీమవరం, ఒంగోలు రైల్వే స్టేషన్లకు కేంద్ర నిధులతో కొత్త హంగులు సమకూరనున్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లకు రెండు వైపులా ప్రవేశ మార్గాలు, నిరీక్షణ మందిరాలు, స్థానిక ఉత్పత్తుల కోసం ప్రత్యేక వేదికలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక వసతులు, లిఫ్టు, ఎస్కలేటర్, బ్యాటరీ కార్లు, ఏసీ విశ్రాంతి గదులను అన్ని వసతులతో సౌకర్యవంతంగా ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దువ్వాడకు రూ.26.31 కోట్లు, విజయనగరానికి రూ.35.16 కోట్లు, ధమన్‌జోడి స్టేషన్ అభివృద్ధికి రూ.13.93 కోట్లు వెచ్చించనున్నారు. మొదటి దశలో ఇప్పటికే కొన్ని స్టేషన్లలో పనులు ప్రారంభమయ్యాయి.