టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు, పవన్‌లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందన్నారు. వికసిత్ భారత్.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. నిన్న ఎన్నికల షెడ్యూలు వచ్చిందని.. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయన్నారు. ఫలితాల్లో ఎన్‌డీఏకు 400 మార్కు దాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చినంత సంబురంగా ఉందన్నారు.
జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీయే 400 సీట్లు దాటాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించారని ప్రధాని మోదీ వివరించారు. కోటప్పకొండ స్వామివారి సాక్షిగా విష్ణు, ఈశ్వర, బ్రహ్మ త్రిమూర్తల ఆశీర్వాదం లభించిందన్నారు. నాలుగు వందలు దాటాలి.. ఎన్‌డీఏకు ఓటు వేయాలని మోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.