నాసిన్ అకాడమీ ఏపీకి రావడం గర్వ కారణం : ప్రధాని నరేంద్ర మోదీ
సత్యసాయి జిల్లా నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
By Medi Samrat Published on 16 Jan 2024 7:15 PM ISTసత్యసాయి జిల్లా నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. నాసిన్ అకాడమీ ఏపీకి రావడం గర్వ కారణమని.. అంతర్జాతీయ స్థాయిలో భారత వాణిజ్య విధానానికి మంచి పేరు ఉందని అన్నారు. ఈజ్ డూయింగ్‌కి నాసిన్ లాంటి సంస్థలతో చాలా ప్రయోజనం ఉంటుందని తెలిపారు నరేంద్ర మోదీ. ధర్మానికి, నిష్పక్షపాత విధానాలకు రాముడే ప్రత్యక్ష నిదర్శనమని, ఆయన పాలన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రభుత్వాల్లో పని చేసే అధికారులంతా శ్రీరాముడిని ప్రేరణగా తీసుకుని పని చేయాలన్నారు. అక్రమంగా దక్కే అధికారాన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పారని.. అక్రమంగా దక్కే అధికారాన్ని తాను కూడా స్వీకరించబోనని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 503 ఎకరాల్లో రూపుదిద్దుకున్న నాసిన్ క్యాంపస్‌లో 3 లక్షల మొక్కలు, 300 ఎకరాల్లో బయోడైవర్సిటీని ఏర్పాటు చేశారు.
ఈరోజు ఉదయం పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడ్నించి ప్రధాని మోదీ లేపాక్షి బయల్దేరి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మోదీ స్వయంగా హారతిపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు మోదీకి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాని రాక నేపథ్యంలో ఆలయంలో తోలు బొమ్మలాట కళారూపం ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మోదీ ఆసక్తికరంగా తిలకించారు. అనంతరం అక్కడ్నించి మోదీ పాలసముద్రం చేరుకున్నారు.