ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించినట్టుగా అధికారులు తెలిపారు. కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, కల్లూరు, ఓర్వకల్ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 2025 అక్టోబర్ 15, 16 తేదీలలో మూసివేయబడతాయి. అక్టోబర్ 16న నగర శివార్లలోని నన్నూర్ టోల్ ప్లాజాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 21, 22 తేదీలకు వాయిదా వేశారు.
ప్రధాని మోదీ ఈనెల 16న ఉదయం 7గంటల 50నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. 10 గంటల 20 నిమిషాల సమయంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11 గంటల 10నిమిషాలకు హెలికాప్టర్లో సున్నిపెంట హెలిప్యాడ్‌కు ప్రయాణమవుతారు. ఉదయం 11 గంటల 45నిమిషాలకు రోడ్డు మార్గంలో శ్రీశైలంకు చేరుకుని శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మవార్ల దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట 40నిమిషాలకు సున్నిపెంట నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు తిరుగు ప్రయాణమవుతారు. రెండున్నర గంటల సమయంలో కర్నూలులోని రాగమయూరి సభా ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.