ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. 'అన్నదాత పోరు' పేరిట ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీ తీరును విమర్శించారు. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని, వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదన హితవు పలికారు. కాకినాడ జిల్లాకు మొత్తం 23,359 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటికే 19,385 మెట్రిక్ టన్నులను సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేశామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరకు యూరియాను అమ్ముకొని రైతులను దోచుకున్నారని వర్మ ఆరోపించారు. ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎమ్మార్పీ రేటుకే యూరియా అందుతుంటే, ఆ వాస్తవం జగన్‌కు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు.