ఆనందయ్య కరోనా ఔషధంపై ఆయుష్ కమిషనర్ రాములు నాయక్ మరోసారి స్పందించారు. ఈ మందుపై ఐదారు రోజుల్లో నిపుణుల నివేదిక వస్తుందని.. నివేదిక పరిశీలించాక ఆనందయ్య ఔషధం కరోనా కట్టడికి పనికి వస్తుందో, లేదో నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. ఆనందయ్య ఔషధంలో వాడుతున్న మూలికలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని తెలిపారు. ఇందులో హానికరమైన పదార్థాలేవీ లేవని అన్నారు. ఏ ప్రాసెస్ లో ఎంత మోతాదులో మందు తయారుచేస్తున్నారో తెలియాలని, ఇప్పటికే మందులో వాడిన 18 రకాల మూలికలపై అధ్యయనం చేశామని రాములు నాయక్ చెప్పారు.

ఈ ఔషధంతో స్వస్థత చేకూరిందని ఎక్కువమంది చెబుతున్నారని రాములు వివరించారు. దీన్ని చట్టపరంగా మాత్రం ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలమని స్పష్టం చేశారు. ఆనందయ్య మందును తాము ఎక్కువ చేసి చెప్పడం లేదని, అలాగని కించపరచడం లేదని అన్నారు. ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే ప్రజలకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. సీసీఆర్ఏఎస్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ ను హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని, ఈ మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేసిందని, దీనివల్ల అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. విచారణకు అనుమతించాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు.

ఆనందయ్య భద్రతపై సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణపట్నం పోర్టులో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి అడిషనల్ ఎస్పీ వెంకటరత్నంతో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనందయ్యకు గట్టి భద్రతను కల్పించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.


సామ్రాట్

Next Story