అలా అన్నారంటే.. జనసేన తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లే..

Perni Nani Fire On Pawan Kalyan. మంగళగిరిలో మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో వైసీపీపై విరుచుకుపడిన జనసేన అధినేత

By Medi Samrat  Published on  18 Oct 2022 5:56 PM IST
అలా అన్నారంటే..  జనసేన తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లే..

మంగళగిరిలో మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో వైసీపీపై విరుచుకుపడిన జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ దిగజారుతున్నారని విమర్శించారు. ఇవాల్టీ నుంచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందని పవన్ ప్రకటించారంటే.. జనసేన తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లేనన్నారు. పవర్ ఫుల్ డైలాగులు సినిమాలకు మాత్రమే సరిపోతాయని, రాజకీయాల్లో ఇలాంటి డైలాగులు పనికిరావని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఇద్దరూ కలిసి శాంతిభద్రతలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

వైసీపీ, కాపుల మధ్య గొడవలు పెట్టడమే పవన్ కల్యాణ్ ధ్యేయమని పేర్ని నాని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆరోపించారు. పవన్ తాజా వ్యాఖ్యలతో దత్తపుత్రుడి ముసుగు తొలగిందని నాని వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడి ముసుగు వెనుక చంద్రబాబు ఉన్నాడని తేలిపోయిందని నాని అన్నారు. దత్తపుత్రుడిగా మారిన పవన్.. సన్నాసిన్నర సన్నాసిగా కూడా మారిపోయారని సెటైర్లు సంధించారు.

తన పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటేయమని చెప్పే నేతను ప్యాకేజీ స్టార్ అనకుండా ఇంకేమంటారని నాని అన్నారు. సోదరా అంటేనే పవన్ కడుపు రగిలిపోతే.. వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అంటే తమకు కడుపు మండదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను పట్టుకుని నా కొడకల్లారా అనేంత బలుపు పవన్ ది.. అని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కు అంత బలుపెందుకు? అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలిపితే.. పవన్ ను ప్యాకేజీ స్టార్ అన్న అందరి తరఫున తానే క్షమాపణ చెబుతానన్నారు.


Next Story