అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఎస్

రానున్నమూడు మాసాలు అధిక ఉష్టోగ్రత,వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వడగాల్పుల నుండి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు.

By Medi Samrat
Published on : 20 March 2025 7:07 PM IST

అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఎస్

రానున్నమూడు మాసాలు అధిక ఉష్టోగ్రత,వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వడగాల్పుల నుండి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. రోజు రోజుకూ పెరుగతున్న ఉష్టోగ్రతలు,రానున్న రోజుల్లో సంభవించే వడగాల్పుల సన్నద్ధతపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయని రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే మూడు మాసాలు ఎండ వేడిమి మరియు వడగాల్పుల నుండి కాపాడుకునేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజల్లో తగిన అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సహా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి కూలీలు పనిచేసే చోట్ల తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రధమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం విద్యార్ధులకు పరీక్షలు జరుగున్నందున ఆయా పరీక్షా కేంద్రాల వద్ద తగిన తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని అన్నారు. నిరంతర‌ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్సుకో అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.

ముఖ్యంగా జిల్లా వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిలా స్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేసేందుకు వీలుగా ఒక నోడలు అధికారిని నియమించుకోవాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. Do’s Don’ts పై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించేందుకు వివిద ప్రచార మాధ్యమాల ద్వారా విస్త్రత ప్రసారం చేయాలని చెప్పారు. ఏఏ ప్రాంతాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదు అయ్యేది ముందుగానే ప్రజలకు సంక్షిప్త సందేశాలు జారీ చేయడం ద్వారా అప్రమత్తం చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను సిఎస్ ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, విద్య, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా, కార్మిక, వ్యవసాయ, విద్యుత్, గ్రామ, వార్డు సచివాలయాల, నీటిపారుదల తదితర విభాగాలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను తీసుకుని ప్రజలను పూర్తి అప్రమత్తం చేయాలని సిఎస్ ఆదేశించారు.

ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని సిఎస్ విజయానంద్ ప్రజలకు సూచించారు. ఎండా కాలంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైతే ఆ పరిస్థితులను హీట్ వేవ్ అంటారని కొన్నిసార్లు అది 6.4 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంటే దానిని తీవ్రమైన హీట్ వేవ్ అంటారని పేర్కొన్నారు. ఎక్కువ ఎండలో తిరిగి వడదెబ్బ తగిలితే శరీరంలో నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందని, దాని వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారని డాక్టర్లు తెలియ జేస్తున్నారని అన్నారు. గత ఏడాది రికార్డులను పరిశీలిస్తే గత ఏడాది మార్చిలో వడగాల్పులు నమోదు కాలేదని ఏప్రిల్ నెలలో రాయలసీమ ప్రాంతంలో 10 రోజులు హీట్ వేవ్ లు,కోస్తా ప్రాంతంలో 9 రోజులు,మే మాసంలో రాయలసీమ ప్రాంతంలో 6 రోజులు, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 5 రోజులు వడగాల్పులు నమోదు అయ్యాయని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు. వడదెబ్బ నుండి ఉపశమనం పొందేందుకు నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచించారు.ఎండ వేడిమి అధికంగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు తెలియజేశారు. పళ్ల రసాలు తాగుతూ ప్రధానంగా శరీరం లవణాలను కోల్పోకుండా కాస్త ఉప్పు వేసిన ద్రవపదార్థాలు తీసుకోవాలని వేసవిలో కూల్ డ్రింకులు కాకుండా కొబ్బరి బొండం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిదని సిఎస్ విజయానంద్ ప్రజలకు సూచించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర విత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్ కూర్మనాధ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18వ తేదీన అత్యధికంగా 42.7 సెంటీగ్రేడ్,19న 42.3 సెంటీగ్రేడ్ ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపారు. భారత వాతావరణ శాఖ ప్రతి రోజు ఉ.8.30గం.లకు సా.4.30 గం.లకు ఉష్టోగ్రతలకు సంబంధించి బులిటెన్లను జారీ చేస్తుందని చెప్పారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది మార్చి నుండి మే వరకూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోందని వివరించారు. అధిక ఉష్టోగ్రతలు, వడగాల్పుల నుండి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఇప్పటికే Do’s, Don’t’s పై వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అంతేగాక ఎప్పటికప్పుడు వాట్సప్, సోషల్ మీడియా ద్వారా అలెర్టులు జారీ చేస్తున్నట్టు కూర్మనాధ్ తెలిపారు. ఈ వీడియో సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story