చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారినపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు.
మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరావతిలో చేనేత వస్త్ర వైభవాన్ని చాటిచెప్పేలా ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. గతంలో 55,500 మంది కార్మికులకు రూ. 27 కోట్ల రుణాలు అందించామని, 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించమన్నారు. మరమగ్గాల కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు కేటాయిస్తున్నామని, వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో దీనిని 500 యూనిట్లకు పెంచుతామన్నారు.