వైఎస్ఆర్ సీపీ సింగిల్ గా ఎన్నికల్లో పోటీకి దిగుతుందని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నేనేమీ మాట్లాడనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు వస్తుండగా.. వాటిని ఆయన ఖండించారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని అన్నారు. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే, అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయని.. వైఎస్ఆర్ సీపీ ఏపీలో బలంగా ఉందని ముందస్తుకు వెళ్లే అవకాశం లేదని అన్నారు. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని, ఆయన రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని అన్నారు. ‘‘మాకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఆలోచన లేదు. మేం పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఒకేసారి వెళ్తాము. చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అందుకే ఇతర పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తున్నాడు. చంద్రబాబు ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకసారి వామపక్షాలు, మరోసారి జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.