అమరావతి : మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని వ్యాఖ్యానించారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని.. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా.? అని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని.. రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉదయం జరిగిన కేబినెట్ మీటింగ్ లో నేను లేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్నారు. ఇది ఇంటర్వెల్ మాత్రమే.. మున్ముందు చాలా సినిమా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని రైతులు, టీడీపీ వేర్వేరు కాదని.. ఇద్దరూ ఒక్కటేనని అన్నారు. న్యాయ పరమైన ఇబ్బందుల కారణంతో వెనక్కి తీసుకుని ఉండవచ్చునని.. నేను ఇంకా ఎవరితోను మాట్లాడలేదు.. మాట్లాడాక చెబుతానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.