ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన సాగుతోందన్నారు. ఏపీలో నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోందని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ లాబీలో ఈరోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరూ పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరు మళ్లీ గెలవాలనుకుంటున్నానని పేర్ని నాని అన్నారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది. దీన్ని గుర్తు చేస్తూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేశవ్ స్పందిస్తూ 1994లో వచ్చిన ఫలితాలే 2024లో వస్తాయని చెప్పారు. 1994లో ఉరవకొండలో టీడీపీ గెలిచిందని టీడీపీ అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. నవ్వుకుంటూనే ఇద్దరూ పరోక్ష కౌంటర్‌లు విసురుకున్నారు