కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకోవచ్చు.. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పేర్ని నాని

MLA Perni Nani Responds On Kotamreddy Sridhar Reddy Comments. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ను ట్యాప్ చేయడాన్ని భరించలేకపోతున్నానని

By M.S.R  Published on  1 Feb 2023 2:45 PM GMT
కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకోవచ్చు.. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పేర్ని నాని

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ను ట్యాప్ చేయడాన్ని భరించలేకపోతున్నానని చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ఆరోపణలను సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి, హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తదితరులు సమావేశమయ్యారు. కోటంరెడ్డి వ్యాఖ్యలపై వీరు చర్చించారని అంటున్నారు. కోటంరెడ్డి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర హోం శాఖ ప్రకటన చేసే అవకాశం ఉంది.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. వీళ్ల ఫోన్లు వింటూ కూర్చోవడమేనా ప్రభుత్వం పని అని సీరియ‌స్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, తమకేమీ ఇబ్బందిలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వాళ్లకు పార్టీపై అభిమానం ఉంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినా.. ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయరని పేర్ని నాని అన్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న కాల్ రికార్డింగ్ క్లిప్పింగ్ సంగతేంటో చూసుకోవాలని ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ క్లిప్పింగ్ పంపించి ఉంటారని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవులు రాకపోవడంతో, సానుభూతి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. ఆరు పర్యాయాలు గెలిచిన వాళ్లకు కూడా మంత్రి పదవులు రాని పరిస్థితి ఉందని, సామాజిక న్యాయం కోణంలోనే మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందన్న విషయాన్ని గమనించాలని అన్నారు.


Next Story