చంద్రబాబుతో మాట్లాడాక ధైర్యం వచ్చింది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు.
By Medi Samrat Published on 10 Oct 2023 7:30 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. నేడు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్‌ల ములాఖత్ ముగిసింది. పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తమతో ఏమేమి మాట్లాడారో వెల్లడించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తమతో అన్నారని పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రజలు, పార్టీ నేతలు ఏవిధంగా ఉన్నారనే ఆవేదన చంద్రబాబులో ఉందని తెలిపారు.
చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తమలో ధైర్యం వచ్చిందని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇక సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు తమతో అన్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా జగన్ ముందుకు తీసుకెళ్లనీయలేదని ఆరోపించారు. ప్రాజెక్టులు చేపట్టట్లేదని సమరభేరి ఎంచుకుని చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారని.. చంద్రబాబు పోరాటంతో ప్రజల్లో స్పందన చూసి ప్రభుత్వం భయపడి ఆయన్ను అరెస్టు చేసిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
చంద్రబాబును మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, బ్రహ్మణి కలిసారు. వారితో పాటు పయ్యావుల కేశవ్ వెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి స్నేహా బ్లాక్‌లో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యం, సదుపాయాలు, భద్రత గురించి వారు అడిగి తెలుసుకున్నారు.