జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసేందుకు ఎంపిక చేశారు. ఈ నెలలోనే జరుగునున్న తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం డాక్టరేట్ అందుకోవడానికి నిరాకరించారు. వివిధ రంగాలలో గొప్పగా రాణించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి డాక్టరేట్ ఇవ్వాలని వేల్స్ యూనివర్సిటీకి లేఖ రాశారు పవన్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
వేల్స్ యూనివర్సిటీ నన్ను డాక్టరేట్ కి ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. అలాగే గౌరవంగా భావిస్తున్నాను. కానీ, నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో సరైన వారికి ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతున్నాను.. అంటూ లేఖను పంపారు పవన్ కళ్యాణ్. రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ తన సినిమాల షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ తన సమయాన్ని పూర్తిగా పార్టీకే కేటాయిస్తున్నారు.