ఏపీలో నేడు మెగా పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహించారు. కడప మున్సిపల్ స్కూల్ లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదని, ఈ ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని అందుకే ఇక్కడ అన్ని సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానన్నారు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ. 45 కోట్లు ఇచ్చామని, నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇస్తున్నానని చెప్పారు. తాగునీటి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాయలసీమ అంటే వెనకబడిన ప్రాంతం కాదని అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమని చెప్పారు.
పేరెంట్-టీచర్ మీటింగ్ కోసం తాను కడపను ఎంచుకోవడానికి కారణం ఉందని, ఇది ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల అని పవన్ కల్యాణ్ అన్నారు. కడప చదువుల గడ్డ అని అభివర్ణించారు. సింహం గడ్డం గీసుకుంటుంది నేను గీసుకోను అని డైలాగులు చెబితే వెనుక రీరికార్డింగులు వస్తాయని, హీరో నడిచినా దానికి రీరికార్డింగ్ ఉంటుందని కానీ కార్గిల్ లో చనిపోయినవారికి, టీచర్లకు రీరికార్డింగులు ఉండవని అన్నారు. కానీ సైనికులు, టీచర్లే నిజమైన హీరోలు అని, వాళ్లను గౌరవించాలని, మీ టీచర్లలో హీరోలను చూసుకోండని విద్యార్థులకు సూచించారు. టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఇది ఎంతవరకు సాధ్యమో తెలియదుకానీ, ఆ దిశగా తాను ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు.