శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ పకడ్బందీగా ఉంటూ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని తెలిపారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు.
శనివారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూం, ఆఫీసర్స్ జిమ్ తదితర విభాగాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూంలో డయల్ 100 పని తీరుపై ఆరా తీశారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఫోన్ చేసినప్పుడు సాంకేతికత సాయంతో వారి లొకేషన్ ఎలా గుర్తిస్తారు.. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఎలా చేరవేస్తారు.. తదితర అంశాలను పోలీస్ అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. స్నేహపూర్వక సేవలు అందిస్తూ పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు.