వైసీపీ, టీడీపీలకు కొమ్ముకాసేందుకు తాము సిద్ధంగా లేమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని పవన్ చెప్పారు. తిరుపతిలోని రామానుజపల్లి జీఆర్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జనసేన ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించిన తర్వాత మాట్లాడారు.
గ్రంథాలయాలకు ఎంతగానో పేరుగాంచిన రాయలసీమలో.. ఇప్పుడు మద్యం ఏరులైపారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి పులివెందులలో హింస అధికమైందని పవన్ అన్నారు. సమాజంలో మార్పు కోసం ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా తట్టుకుంటామని, టైమ్ వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతామన్నారు. అయితే మరోసారి వైసీపీ సర్కార్ రాకూడదనేదే తమ ప్రస్తుత వ్యూహమని చెప్పారు. తమతో కలిసి పనిచేయాలనుకునే నేతలు.. ముందుగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో గనులు, అటవీ సంపద దోపిడీ జరుగుతోందని పవన్ అన్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, వేధింపులు పెరిగాయని, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే వెనుకబడిన కులాలకు అధికారం దక్కాలి అని పవన్ అన్నారు. రాయలసీమలో అగ్రవర్ణాల ముందు చేతులు కట్టుకునే సంస్కృతికి చరమగీతం పాడటానికి కృషి చేస్తామన్నారు.