తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఇదే ఘటన మీ మతంలో జరిగి ఉంటే మీరు ఇలాగే స్పందించేవారా? భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుందని అన్నారు. ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా, హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండవనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఆ అక్రమాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని అన్నారు. ఇటీవల పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్నారు. తిరుమలలో జరిగిన అన్ని అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని స్పష్టం చేశారు. హిందువులు మెజారిటీ అనడం ఒక భ్రమ మాత్రమేనని అన్నారు.. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా హిందువులు విడిపోయి ఉన్నారని పవన్ తెలిపారు.