ఏపీని నివర్‌ తుఫాన్‌ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. తుఫాన్‌ కారణంగా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఇటీవ‌ల రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి, రైతుల‌ను ప‌రామ‌ర్శించి వారికి జ‌రిగిన న‌ష్ట వివరాల‌ను తెలుసుకున్నారు. చేతికి అంది వచ్చే సమయంలో పంట వరదలో మునగడంపై పవన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించిన సమయంలో వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ కూడా చేశారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం దిగిరాలేదు.

వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేపడతానని ఇప్పటికే ప్రకటించిన పవన్.. బాధితులకు పదివేల రూపాయల ఆర్థిక సాయం తక్షణం అందించాలంటూ ఈ రోజు దీక్షకు దిగారు. తన నివాసంలో పవన్ ఈ దీక్షను చేపట్టారు. నష్ట పరిహారంగా రూ.35 వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ. 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

"తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10 వేలు ఇవ్వాలన్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి డిమాండ్ కు ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా ఈ రోజు తన నివాసంలో ఉదయం 10గం.లకు దీక్షలో కూర్చున్నారు." అంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

మ‌రోపక్క ఏపీలోని కలెక్టరేట్ల ఎదుట జనసేన నేతలు, కార్యకర్తలు కూడా నిరసన దీక్షలకు దిగారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు.

సామ్రాట్

Next Story