ప్ర‌ముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్‌ రెడ్డి ఉడుములకు ప‌వ‌న్ ప్ర‌శంస‌లు

ఎర్రచందనం మాఫియాపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ సుధాకర్‌ రెడ్డి ఉడుముల చేసిన లోతైన‌ దర్యాప్తును ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసించారు.

By -  Medi Samrat
Published on : 15 Nov 2025 4:21 PM IST

ప్ర‌ముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్‌ రెడ్డి ఉడుములకు ప‌వ‌న్ ప్ర‌శంస‌లు

ఎర్రచందనం మాఫియాపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ సుధాకర్‌ రెడ్డి ఉడుముల చేసిన లోతైన‌ దర్యాప్తును ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసించారు. ఎర్రచందనం అక్రమ వ్యాపారం జరిగిన ప్రమాదకరమైన ప్రాంతాల్లో సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్‌రెడ్డి ఉడుముల చేసిన కృషిని ఆయ‌న‌ అభినందించారు. ఆయన రచించిన పుస్తకం బ్లడ్‌ సాండర్స్ - ది గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్ ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ ప్లానెట్ కిల్లర్స్ వాస్తవ పరిస్థితులకు అద్ధం ప‌ట్టింద‌ని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్‌లో “మీరు అత్యంత ప్రమాదకర ప‌రిస్థితుల‌లో.. ఎంతో శ్రమతో కూడిన ప్రయత్నం చేసినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ విషయం ప్రజలకు తెలియాలి. రెడ్ సాండర్స్ స్మగ్లింగ్‌పై రౌండ్ టేబుల్ సమావేశానికి త్వరలో మిమ్మల్ని ఆహ్వానిస్తాం.” అని పేర్కొన్నారు.

డాక్యుమెంటరీలో ఎర్రచందనం చెట్లను నరికి వేయడం, రవాణా, అక్రమ ఎగుమతి పద్ధతులను స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చూపారని పవన్ కల్యాణ్ చెప్పారు. శేషాచలం అడవిలో జరుగుతున్న విధ్వంసం, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన నెట్‌వర్క్‌, అమాయక అటవీ సిబ్బంది ప్రాణనష్టాన్ని ఈ పుస్తకం బయటపెట్టిందని పేర్కొన్నారు.

రాజకీయ అండ ఉన్న నెట్‌వర్క్స్‌పై కూడా ఆయన హెచ్చరించారు. “రాజకీయ వేషధారణలో తిరిగే క్రిమినల్స్ చాలా ప్రమాదకరంగా మారారు. స్మగ్లర్లతో కలిసి నడుచుకుంటూ తమ రాజకీయాలకు ఇంధనంగా ఎర్రచందనం అక్రమ రవాణాను ఉపయోగించుకున్నారు” అని అన్నారు. పుస్తకం నుంచి డాక్యుమెంటరీ వరకు… దశాబ్దాల దర్యాప్తు ఆధారాలు సేకరించారన్నారు. ప్లానెట్ కిల్లర్స్—సుధాకర్‌రెడ్డి ఉడుముల దశాబ్దాల రిపోర్టింగ్‌, డాక్యుమెంటేషన్‌, ఫీల్డ్‌వర్క్‌పై రూపొందించారన్నారు. ఆయన పుస్తకాన్ని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విడుదల చేశారు.

మార్టిన్ బౌడోట్ నిర్మాణం, హ్యూగో వాన్ ఆఫెల్ దిశానిర్దేశంలో రూపొందిన ఈ చిత్రం అనేక ప్రాంతాలకు విస్త‌రించిన నెట్‌వ‌ర్క్‌ను, ఆ నెట్‌వ‌ర్క్‌ను ట్రాక్ చేసేందుకు చేసిన‌ లోతైన‌ దర్యాప్తును క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తుంది. శేషాచలం అడవి, తిరుపతి, హైదరాబాద్‌, గుంటూరు, కడప, చెన్నై, జవాధు కొండలు (తమిళనాడు), ఫ్రాన్స్, లియోన్‌లోని ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం, సింగపూర్ ఇంటర్‌పోల్ పర్యావరణ విభాగం పాత్ర గురించి ఇందులో చూస్తాం.. అలాగే.. దుబాయ్—అక్కడ నుంచి స్మగ్లర్ సాహుల్ హమీద్ ఈ రాకెట్‌ను ఎలా ఆప‌రేట్ చేస్తున్నాడో వింటాం

ఉడుముల సుధాక‌ర్ రెడ్డి అందించిన ఆధారాలు, జర్నలిస్టిక్ సమాచారం డాక్యుమెంటరీకీ కీలకమైంది. అడవుల్లో ప్రమాదకరంగా ప్రయాణించడంతో పాటు కీలక నిందితులతో ముఖాముఖి మాట్లాడటం, దారితప్పించే మార్గాలు, ప్రమాదకర అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌, వడివడిగా పనిచేసే కూలీలు, స్మగ్లర్లు, అటవీ అధికారులు, పోలీసులు ఇలా.. అందరితో జరిగిన ఇంటర్వ్యూలు ఈ దర్యాప్తుకు బలం చేకూర్చాయి. చెన్నైలో కూడా కీలక నిందితుడు గంగిరెడ్డితో మాట్లాడారు.

డిఫ్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసలకు సుధాకర్‌రెడ్డి ఉడుముల స్పందిస్తూ.. “ఈ ప‌నిని గుర్తించినందుకు పవన్‌కల్యాణ్ గారికి ధన్యవాదాలు. రెడ్‌ సాండర్స్ రక్షణపై సంస్థాగతంగా మరింత చర్యలు తీసుకునే చర్చలు ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాను. అని పేర్కొన్నారు.



Next Story