సీట్ల సంఖ్య కాదు.. రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: పవన్ కళ్యాణ్
ఏపీలో జరగనన్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగాయి.
By Srikanth Gundamalla
సీట్ల సంఖ్య కాదు.. రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: పవన్ కళ్యాణ్
ఏపీలో జరగనన్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ఇక ఈ పొత్తులో బీజేపీ కూడా కలిసింది. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఇక మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై అధికార పార్టీ వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సీట్ల పంపకాలతో పాటు.. పొత్తు అంశాలపై మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపకం జరిగిందనీ పవన్ కళ్యాణ్ అన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తివంతమైన, దార్శనిక నాయతక్వంలో ఏపీలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందని అన్నారు. కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభిశృద్ధికి ఒక బలమైన పునాదిపడిందని ప్రగాఢ విశ్వాసమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.