విజయవాడలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర స్ఫూర్తిని కొద్దిరోజులు మాత్రమే కాకుండా చిరకాలం గుర్తించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారందరి త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు జనసేన ముందుకు వచ్చిందన్నారు. సైద్ధాంతిక బలం లేని కారణంగానే రాజకీయ పార్టీలు ముందుకు సాగడం లేదన్నారు.
కులం, మతం, ప్రాంతీయత ఆధారంగా ముందుకు సాగే పార్టీల మనుగడ కొద్ది రోజులకే పరిమితమవుతుందని అన్నారు. నాటి స్వాతంత్య్ర సమరయోధులు కుల, మతాలకు అతీతంగా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, నాయకులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలోని సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ, టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.